Job 20

1. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2. ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

3. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.

4. దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రముండును.

5. ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?

6. వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగినను మేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను

7. తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు.

8. కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు.

9. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు

10. వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును.

11. వారి యెముకలలో ¸యౌవనబలము నిండియుండును గాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును.

12. చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి.

13. దాని పోనియ్యక భద్రము చేసికొనిరి, నోట దానినుంచుకొనిరి.

14. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును.

15. వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.

16. వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.

17. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు

19. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

20. వారు ఎడతెగక ఆశించిన వారు తమ యిష్టవస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు.

21. వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు.

22. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును.

23. వారు కడుపు నింపుకొననైయుండగా దేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును.

24. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును.

25. అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును.

26. వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును.

27. ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.

28. వారి యింటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.

29. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.

Reader settings

SmallerLarger

Applies to this Bible page only.