Job 19
1. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను
2. ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు?ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?
3. పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.
4. నేను తప్పుచేసినయెడల నా తప్పు నా మీదికే వచ్చును గదా?
5. మిమ్మను మీరు నామీద హెచ్చించుకొందురా? నా నేరము నామీద మీరు మోపుదురా?
6. ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరుతెలిసికొనుడి.
7. నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
8. నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసి యున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు
9. ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
10. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమై పోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
11. ఆయన నామీద తన కోపమును రగులబెట్టెనునన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
12. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరివారు నామీద ముట్టడిదిబ్బలు వేసిరినా గుడారము చుట్టు దిగిరి.
13. ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
14. నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
15. నా యింటి దాస దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినై యున్నాను.
16. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను.
17. నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము.
18. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
19. నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
20. నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది
21. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
22. నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?
23. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరు చున్నాను.
24. అవి యినుప పోగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను.
25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
26. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.
27. నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి
28. జరిగినదాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన యెడల
29. మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.
Reader settings
Applies to this Bible page only.