Job 14
1. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.
2. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
3. అట్టివాని మీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించియున్నావు.
4. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.
5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి యున్నావు
6. కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము.
7. వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియుదానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకముకలదు.
8. దాని వేరు భూమిలో పాతదై పోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను
9. నీటి వాసన మాత్రముచేత అది చిగుర్చునులేత మొక్కవలె అది కొమ్మలు వేయును.
10. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?
11. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.
12. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.
13. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను.
14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
15. ఆలాగుండిన యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
16. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు
17. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
18. పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండయైనను దాని స్థానము తప్పును.
19. జలము రాళ్లను అరగదీయునుదాని ప్రవాహములు భూమియొక్క ధూళిని కొట్టుకొనిపోవును నీవైతే నరుల ఆశను భంగపరచుచున్నావు.
20. నీవు వారిని ఎల్లప్పుడు గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురునీవు వారికి ముఖవికారము కలుగజేసి వారిని వెళ్లగొట్టుచున్నావు.
21. వారి కుమారులు ఒకవేళ షునత వహించినను అదివారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికిపట్టెనని వారు గ్రహింపకయుందురు.
22. తమమట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమమట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు.
Reader settings
Applies to this Bible page only.