Genesis 20

1. అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తర్లిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.

2. అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.

3. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.

4. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?

5. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.

6. అందుకు దేవుడు అవును, యధార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.

7. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.

8. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతులన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.

9. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.

10. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా

11. అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.

12. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.

13. దేవుడు నన్ను నా తండ్రి యిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.

14. అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.

15. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.

16. మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయ మంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.

17. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలు కనిరి.

18. ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

Reader settings

SmallerLarger

Applies to this Bible page only.